హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వాన.. వచ్చే 5 రోజులూ రెయిన్ అలర్ట్

 


ఈసారి మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎండలు మాడు పగులగొట్టాయి. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా వుంటుందోనని జనం భయపడ్డారు. కానీ అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మే నెల వస్తూనే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నిత్యం ఎక్కడో ఓ చోట పడుతూనే వున్నాయి. దీంతో ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం కాస్తంత సేదతీరారు. 

తాజాగా హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, బోరబండ, రెహమత్ నగర్, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్, హైదర్‌నగర్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, మల్కాజిగిరి, నాగారం, కుత్బుల్లాపూర్ , చింతల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

మరోవైపు.. రాగల 5 రోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం నాటికి మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లుగా ఐఎండీ వెల్లడించింది. 


 

Comments